
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. ఈ దేశానికి నాయకత్వం వహిస్తుందనీ అందరూ అనుకుంటుంటే...ఆ పార్టీయే నాయకత్వం లేక సతమతమవుతోంది. కమలం(బీజేపీ) పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ మాదిరిగా తయారవుతోంది. ఈ పార్టీ నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ నేతల మాదిరిగా పలు కుంభకోణాల్లో ఇరుక్కుంటున్నారు. పార్టీని వీడుతున్నారు. దీనితో కమలం పార్టీ పట్ల ప్రజలు పెట్టుకున్న నమ్మకాలన్నీ ‘బూడిదలో పోసిన పన్నీరు వలే వ్రుధాగా’ మారుతున్నాయి. కమలానికి నాయకత్వం వహిస్తున్న మహారాష్ర్టకు చెందిన నితిన్ గడ్కరీని అవినీతి, అక్రమాలు చుట్టుముడుతున్నాయి.
దక్షిణాదిలో మొట్టమొదటిసారిగా బీజేపీ పాలిత రాష్ర్టానికి ప్రాతినిథ్యం వహిచింన యడ్యూరప్ప కమలాన్ని వీడుతున్నారు. డిసెంబర్ లో యడ్డి కర్ణాటక జనతా పార్టీ(కేజేపీ) పేరిట కొత్తగా ప్రాంతీయ పార్టీని స్థాపిస్తున్నారు. మరో వైపు రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుందరరాజే కూడా పార్టీ నాయకత్వంపై అసంత్రుప్తితో ఉన్నారు. ఆంధ్ర రాష్ర్టంలో రాజశేఖర్ రెడ్డి చనిపోయాక కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే కుక్కలు చింపిన విస్తరిలా మారిందో...వాజ్ పేయి నాయకత్వం నుంచీ వైదొలిగాక కమలం పరిస్థితి అంతే అయ్యిందనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ గురించి అరవింద్ కేజ్రీవాల్ చిట్టా విప్పడంతో కమలనాథులు కూడా కాంగ్రెస్ నేతలకు తక్కువేమీ తీసి పోలేదనీ యావత్ దేశానికి తెలిసిపోయింది.
గడ్కరీ అక్రమార్జనకు సంబంధించిన షెల్ కంపెనీలు పుంఖానుపుంఖాలుగా బయటపడుతున్నాయి. గడ్కరీ సొంత రాష్ర్టం నుంచీ కేంద్ర హెంశాఖ మంత్రిగా పనిచేస్తున్న సుశీల్ కుమార్ షిండే కూడా గడ్కరీ అక్రమాలు వాస్తమనే విధంగా మాట్లాడుతున్నారు. గడ్కరీకి సంబంధించి ఇప్పటి వరకు 5 షెల్ కంపెనీలు బయటపడ్డాయి. కంపెనీ పేరు రిజిస్టరై ఉంది కానీ, ముంబైలో సదరు కంపెనీ చిరుమానామాల తాలూకు వివరాలను ఎంత వెతికినా కనబడటం లేదట. అయితే, తాను ఎప్పుడో పైన పేర్కొన్న కంపెనీలన్నింటికీ రాజీనామా చేశాననీ గడ్కరీ చెబుతున్నారు. సంబంధిత శాఖాధికారులు మాత్రం గడ్కరీకి సంబంధించిన కంపెనీలపై ఆరా తీస్తూ దడ పుట్టిస్తున్నారు. ఒకవైపు నితిన్ గడ్కరీ గొడవతో బెంబేలెత్తిపోతున్న బీజేపీకి యడ్యూరప్ప సమ్మెటపోటు మొదలైంది. అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కొత్త పార్టీ ఏర్పాటుకు చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఈమేరకు ఆయన పార్టీ ఏర్పాటు ప్రక్రియ లాంఛనంగా ప్రారంభించారు. అంతేకాదు, చామరాజనగర్ నుంచి తన పర్యటన ప్రారంభించడం ద్వారా పదాధికారుల ఎంపిక ప్రక్రియను కూడా ప్రారంభించారు. చామరాజనగర్‌కు వచ్చిన యడ్యూరప్పకు కార్యకర్తల, జిల్లా ప్రముఖుల నుంచి ఘనస్వాగతం లభించింది. మరోవైపు గుజరాత్ సీఎం నరేంద్రమోడి ఉండనే ఉన్నాడు. త్వరలో జరిగే ఎన్నికల్లో గుజరాత్ సీఎంగా మోడి హ్యాట్రిక్ సాధించడం ఖాయం. 2014ఎన్నికల్లో మోడిని బీజేపీ తరుపున పీఎం అభ్యర్థిగా ప్రకటించాలనే వాదన అప్పుడు మొదలైంది. ఇలా అనేక సమస్యలతో బీజేపీ కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో కమలానికి కొత్త నాయకత్వం వస్తే...పార్టీ అధ్యక్షుడుగా మన రాష్ర్టానికి చెందిన వెంకయ్యనాయుడికి ఆ అవకాశం లభించవచ్చనీ కూడా పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.