
హైదరబాద్: కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో రాష్ర్టం నుంచీ మునుపెన్నడూ లేని విధంగా ఐదుగురికి స్థానం కల్పించారు. ఐదుగురికి స్థానం కల్పించడంతో మన రాష్ర్టానికి ప్రాధాన్యత పెరిగిందినీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మంత్రి వర్గంలో రాష్ట్రానికి పెద్దపీట వేయడంతో మన రాష్ర్టం పట్ల యూపీఏ ఛైర్మన్ సోనియాకు ఎంతో ప్రేమ వుందనీ కాంగ్రెసోళ్లు చంకలు గుద్దుకుంటున్నారు. ఇక అసలు విషయానికి వద్ధాం...లోక్ సభ ఎన్నికలకు కేవలం 17నెలలు మాత్రమే మిగిలింది. ఈ ఎన్నికలను ఎదుర్కోవడానికి గానూ కొత్తగా నియమితులైన మంత్రులపై కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యంగా యువనేత రాహూల్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. తాజాగా జరిగిన కేంద్ర మంత్రి మండలి మొత్తం యువనేత రాహూల్ కనుసైగల్లో జరిగిందనీ వేరే చెప్పనక్కర్లేదు. 2014ఎన్నికలే లక్ష్యంగా ఈ కేబినెట్ విస్తరణ జరిగింది. సీనియర్లను కాదనీ, రాజకీయంగా సుదీర్ఘమైన అనుభవం ఉన్న వారికి కాకుండా నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చిన వారికి కూడా రాహూల్ అవకాశం ఇచ్చారు. దీనికి కారణం లేకపోలేదు.
కొత్తగా వచ్చిన వారికి ఎలాంటి ‘మచ్చ’లు ఉండవనీ, దీనితో ప్రజల్లోకి వెళ్లితే ఫలితాలు అనుకూలంగా ఉంటాయనీ రాహూల్ భావన కావచ్చు. అయితే, ఒకసారి మన రాష్ర్టం నుంచీ కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన మంత్రుల్ని తీసుకుందాం. వారి వారి జిల్లాలో వారికి ఉన్న పట్టు ఏమిటో కాస్త వెనక్కి వెళ్లి పరిశీలిద్దాం. మొదటగా పీఆర్పీపీ మాజీ అధ్యక్షుడైన, ప్రస్తుత కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కొణిదెల చిరంజీవిని తీసుకుందాం. గత నాలుగేళ్ల కిందట సామాజిక న్యాయంతో పీఆర్పీని స్థాపించారు.ముఖ్యమంత్రి లక్ష్యంగా ఈ పార్టీని పెట్టి బొక్కాబోర్ల పడ్డారు. తన సొంత గ్రామమైన పాలకొల్లు నుంచీ పోటీ చేసి ఓడిపోయారు. తిరుపతిలో గెలిచారు. పార్టీని పెట్టి రెండుమూడేళ్లకే కాంగ్రెస్ లో కలిపేశారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న తిరుపతి ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేస్తే గత జూన్ లో ఉప ఎన్నిక వచ్చింది.
ఆ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణకు పట్టుబట్టి మరీ టికెట్ ఇప్పించుకున్నారు. గెలిపించుకుంటాననీ మరీ తొడలు కొట్టారు. కానీ, వెంకటరమణ గెలువలేదు. అంతేకాదు, అదే నెలలో జరిగిన ఉప ఎన్నికల్లో చిరంజీవి కడప, కర్నూలు, పశ్చిమ గోదావరి, అనంతపురం తదితర జిల్లాలో పర్యటించారు. ఆయన ప్రచారం చేసిన ఏ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలువలేదు. అటువంటి చిరంజీవిని రాహూల్ కేంద్రమంత్రిని చేశారు. ఇక మరో మంత్రిగా ప్రమాణం చేసిన కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డిని తీసుకుందాం. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తన భార్య సూజాతమ్మకు టికెట్ ఇప్పించుకున్నారు. ఆమె ఓడిపోయారు. జూన్ నెలలో కోట్ల సొంత జిల్లా అయిన ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరులో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ రెండింటిలోనూ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. అంతకుముందు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ వైఎస్ఆర్ అభ్యర్థి గెలిచారు.
మరో మంత్రి బలరామ్ నాయకును తీసుకుంటే...జూన్ లో పరకాలలో ఉప ఎన్నిక జరిగింది. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డిపాజిట్ గల్లంతయ్యింది. ఇక చివరగా కిల్లి క్రుపారాణి విషయానికి వస్తే శ్రీకాకుళం జిల్లాలోనూ జూన్ లో ఉప ఎన్నిక జరిగితే ఆ ఎన్నికల్లోనూ వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి గెలిచారు. మరో మంత్రి సర్వే సత్యనారాయణ సంగతి సరేసరి. మంత్రులుగా ప్రమాణం చేసిన వీరంతా ఎంపీలుగా వారి వారి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోలేకపోవడమే కాకుండా,కనీసం డిపాజిట్లు కూడా తెప్పించుకోలేకపోయారు. అటువంటి వారికి రాహూల్ ఏరికోరి కేంద్ర మంత్రుల్ని చేశారు. వీరి నాయకత్వంలో వచ్చే ఎన్నికల్లో వెళ్లాలనుకుంటున్నారట. తమ సొంత ఊళ్లోనే గెలువలేని వాళ్లు రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తెస్తారనుకోవడం రాహూల్ అత్యాశ అనుకోవాలా? లేక అమాయకత్వమనీ అనుకోవాలా?తమకు మాత్రం అర్థం కావడం లేదనీ కాంగ్రెస్ లోని ద్వితీయశ్రేణి నాయకులు అనుకుంటున్నారు. ఏది ఏమైనా రాహూల్ ఫార్మూల బెడిసికొట్టడం ఖాయమనీ కాంగ్రెసోళ్లే అంటున్నారు.
No comments:
Post a Comment