Wednesday, 4 July 2012

సోనియా గాంధీకి పివి నో: అర్జున్ సంచలనం


Arjun Singh Memoirs Is Cong Compartments To Nehru
దివంగత కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత అర్జున్ సింగ్ స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహా రావుని టార్గెట్ చేశారు! అర్జున్ సింగ్ తన ఆత్మకథలో పివిపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకించారని, బాబ్రీ మసీదు కూల్చివేత సంఘటనను తేలిగ్గా తీసుకున్నారని ఆరోపణలు గుప్పించారు. బాబ్రీ కూల్చివేత సమయంలో నీరోలా వ్యవహరించారని విమర్శలు గుప్పించారు.
సోనియాను పార్టీ అధ్యక్షురాలిని చేద్దామన్న సూచన వినగానే పివి నరసింహా రావు మండిపడ్డారని, ఇంజనుకు తగులుకుని రైలు పెట్టెలన్నీ దాని వెనకాలే వెళ్లినట్టు నెహ్రూ - గాంధీ కుటుంబం వెనకే కాంగ్రెస్ పార్టీ వెళ్లడం దేనికి? కాంగ్రెస్ పార్టీని ఇలా రైలింజన్‌లా పరిగణించాల్సిన అవసరం ఉందా? అని పెద్దగా అరిచారని, ఆయన తీరు చూశాక.. రాజకీయాల వికృత రూపం తన ముందు ప్రత్యక్షమైనట్టయి, అసహ్యం వేసిందని అర్జున్ సింగ్ తన పుస్తకంలో పేర్కొన్నారు.
బాబ్రీ మసీదు కూల్చివేత వార్త వినగానే పివికి ఫోన్ చేశానని, ఆయన ఒక గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని కూర్చున్నారని చెప్పారని, తన మనసుకి ఇదంతా రోమ్ తగలబడుతున్నప్పుడు నీరో ఫిడేలు వాయిస్తున్న దృశ్యాన్నే గుర్తుకు తెచ్చిందని రాశారు. తన మాటల్ని ఎంతో శ్రద్ధగా, సావధానంగా వింటున్నట్టు పివి నటించారని అయితే, ఆయన ఈ అంశాన్ని అంత సీరియస్‌గా తీసుకోవట్లేదని తనకు అనిపించిందని, ఓ చిన్న కార్యకర్తతో తాను అనవసర విషయాలు చర్చిస్తున్న అనుభూతి కలిగిందని అర్జున్ రాశారు.
1991 మేలో రాజీవ్ గాంధీ హత్యకు గురైన తరువాత సోనియా గాంధీని కాంగ్రెస్ అధ్యక్షురాలిగా చేయాలన్న సూచనపై పివి మండిపడ్డారని తెలిపారు. ఈ పుస్తకాన్ని మొదలుపెట్టి కొన్ని పేజీలు రాసిన అర్జున్ సింగ్ గతేడాది మార్చి 4న కన్నుమూశారు. దీంతో ఆయన సన్నిహితుడైన అశోక్ చోప్రా ఈ గ్రంథాన్ని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అర్జున్ సింగ్ డైరీల నుంచి సమాచారాన్ని సేకరించి, ఆయన కుటుంబ సభ్యులతో, ఆయన సన్నిహితులతో మాట్లాడి ఈ గ్రంథాన్ని పూర్తి చేయాలనుకుంటున్నట్టు చోప్రా చెప్పారు.
ప్రస్తుతం ఈ గ్రంథాన్ని వర్క్ ఇన్ ప్రోగ్రెస్‌లాగా పరిగణించాలని కూడా ఆయన కోరారు. 383 పేజీల దాకా పూర్తయిన ఈ పుస్తకంలో ఎన్నో సంచలనాత్మక విశేషాలున్నాయి. సోనియాకు పదవి విషయంలో పార్టీ కోశాధికారి, సీనియర్ నాయకుడు సీతారాం కేసరి ఆ తరువాత పివిని కలుసుకుని నచ్చజెప్పారని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని, మొదట సోనియా గాంధీకి కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఇవ్వజూపడం మంచిదని అనునయించారు. తొందరపడి తాను ఎక్కువగా మాట్లాడినట్టు పివి అప్పటికి గ్రహించారని అర్జున్ తెలిపారు.
ఆ తర్వాత ఆయన సాలోచనగా, ఇటువంటి సూచన చేయడంలో తప్పులేదని కానీ, ఆమె ఒప్పుకొంటారా? అన్నదే ప్రశ్న అన్నారన్నారు. మనం వెళ్లి సోనియాను వ్యక్తిగతంగా కలిసి, స్పందనను తెలుసుకుంటే తప్ప దీని గురించి మన దగ్గర సమాధానమేమీ లేదని అన్నారని రాశారు. దీనిపై తర్వాత తాను, విన్సెంట్ జార్జ్, ఎం.ఎల్.ఫోతేదార్ వెళ్లి సీతారాం కేసరిని కలుసుకున్నట్టు అర్జున్ పేర్కొన్నారు.

No comments:

Post a Comment